27, నవంబర్ 2012, మంగళవారం

కార్తీక సోమవార వ్రతము






వినినంత మాత్రము చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన 
సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్దగా ఆలకించండి
ఈ నెలలో శివ ప్రీతిగా సోమవార వ్రతమాచరించేవాడు తప్పనిసరిగా
కైలాసాన్ని చేరుకుంటాడు.కార్తీకమాసంలో వచ్చే ఏ సోమవారము 
నాడయిన సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు వెయ్యి
అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు.
ఈ సోమవార వ్రతవిధి ఆరు రకాలుగా ఉంది
౧.ఉపవాసము
౨.ఏకభుక్తము
౩.నక్తము 
౪.అయాచితము
౫.స్నానము
౬.తిలదానము

౧.ఉపవాసము
శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసముతో
గడిపి,సాయంకాలమున శివాభిషేకము చేసి నక్షత్ర దర్శనాంతరమున
తులసీతీర్థము మాత్రమే స్వీకరించాలి.

౨.ఏకభుక్తము
సాధ్యం కానివాళ్ళు ఉదయం స్నాన దాన జపాదులను యధావిధిగా 
చేసికొని మధ్యాహ్నమున భోజనం చేసి.రాత్రి భోజనానికి బదులు
శైవతీర్థమో,తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి.

౩.నక్తము 
పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనము గాని
ఉపాహారమును గాని స్వీకరించాలి.

౪.అయాచితము
భోజనానికై తాము ప్రయత్నించకుండా యెవరైనా వారికి వారుగా 
పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము.

౫.స్నానము
పై వాటికి వేటికి శక్తి లేనివాళ్ళు సమంత్రక స్నాన జపాదులు
చేసినప్పటికిని చాలును 

౬.తిలదానము
మంత్ర జపవిధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారము నాడు
నువ్వులను దానము చేసినా సరిపోతుంది

పై ఆరు పద్ధతులలో దేనినాచరించినా కార్తిక సోమవార వ్రతము చేసినట్లే
అవుతుంది.ఈ వ్రతాచరణము వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు
సాయుజ్యమును పొందుతారు.కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారము 
నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనము అనంతరము
భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానములో గడిపేవారు తప్పనిసరిగా 
శివ సాయుజ్యాన్ని పొందుతారు..

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి